Richest Village In Telangana : తెలంగాణలోనే అత్యంత ఖరీదైన గ్రామం ఇది.. ఇంతకీ ఇది ఎక్కడ ఉందో తెలుసా?
Richest Village In Telangana : ఆ గ్రామాన్ని తెలంగాణ యూఎస్ఏ అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలో ప్రతి వీధిలో ఫ్రీ హాట్ స్పాట్ లు ఉంటాయి. ప్రతి వీధికి సిసి రోడ్లు.. సోలార్ దీపాలు కనిపిస్తూ ఉంటాయి.

Richest Village In Telangana : ఆ గ్రామాన్ని తెలంగాణ యూఎస్ఏ అని పిలుస్తుంటారు. ఆ గ్రామంలో ప్రతి వీధిలో ఫ్రీ హాట్ స్పాట్ లు ఉంటాయి. ప్రతి వీధికి సిసి రోడ్లు.. సోలార్ దీపాలు కనిపిస్తూ ఉంటాయి. సామాజిక చైతన్యానికి.. ఆర్థిక అభివృద్ధికి.. సంఘటిత శక్తికి ప్రతిరూపంగా ఆ గ్రామం కనిపిస్తూ ఉంటుంది. తెలంగాణలోనే అత్యంత ధనవంతమైన గ్రామంగా పేరు పొందింది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ పరిధిలో ఉంది అంకాపూర్ అనే గ్రామం. అంకాపూర్ పేరు చెప్తే నాటుకోడి కూర గుర్తుకు వస్తుంది. అంకాపూర్ లో స్వచ్ఛమైన స్వదేశీ నాటు కోళ్లు పెరుగుతాయి. ఇక్కడ నాటు కోళ్లను ప్రత్యేకంగా పెంచి.. అప్పటికప్పుడు ప్రత్యేకమైన మసాలాలతో వండుతుంటారు. అందువల్లే అక్కడి కోడి కూరకు విపరీతమైన క్రేజీ ఉంటుంది. హైదరాబాద్ నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కేవలం అంకాపూర్ ప్రాంతానికి నాటుకోడి కూర తినడానికి మాత్రమే పర్యాటకులు వస్తుంటారంటే మామూలు విషయం కాదు. ఈ ప్రాంతంలో నాటు కోళ్లు విపరీతంగా ఉంటాయి. పైగా ఇక్కడ పెరిగే నాటు కోళ్లు అత్యంత రుచికరంగా ఉంటాయి. వీటిని ప్రత్యేకంగా తయారుచేసిన మసాలాలతో వండుతుంటారు. అందువల్లే వీటికి ఈ స్థాయిలో రుచి ఉంటుంది. కిలో చికెన్ కు 500 నుంచి 700 వరకు తీసుకుంటారు . దాంతోపాటు బగార అన్నం కూడా వడ్డిస్తుంటారు..
తెలంగాణలోని అత్యంత ఖరీదైన గ్రామం..
నాటుకోడి కూరకు మాత్రమే కాదు అంకాపూర్ తెలంగాణలోనే అత్యంత ఖరీదైన గ్రామంగా పేరుపొందింది. ఈ గ్రామంలో నాణ్యమైన పసుపు పండుతుంది. ఒక్కో రైతు పొదలకూరు ఎకరాల్లో పసుపును పండిస్తుంటారు. పైగా ఈ ప్రాంతంలోని రైతు కుటుంబాలకు చెందిన వారంతా విదేశాలలో స్థిరపడ్డారు. ఆర్థికంగా స్థిరత్వాన్ని సాధించారు. అందువల్లే ఈ గ్రామంలో గృహాలు అత్యంత ఆధునికంగా కనిపిస్తాయి. ఖరీదైన టైల్స్, మార్బుల్స్, పెయింట్ లతో దర్శనమిస్తాయి. ఈ గ్రామంలో గృహాలను చూస్తే ఏ బంజారాహిల్సో, జూబ్లీహిల్సో ఉన్నట్టు అనిపిస్తుంది..ట్రిబుల్ బెడ్ రూం కు తక్కువ కాకుండా ఇళ్ళను నిర్మించుకున్నారు. ఒక్కో ఇంటి వద్ద ఫార్చునర్ కార్లు, బెంజ్ కార్లు దర్శనమిస్తుంటాయి. చాలామంది రైతులు తమ పొలాలకు వెళ్లడానికి కార్లను ఉపయోగిస్తారు అంటే కాదు.. కొంతమంది రైతులయితే పొలాల దగ్గర కోసిన వరిగడ్డిని ఇంటికి తీసుకురావడానికి కార్లను ఉపయోగిస్తారు. ఇక్కడ పశుసంపద కూడా ఎక్కువే. ఇక ఇక్రిశాట్, యునెస్కో వంటి సంస్థలు ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా పేర్కొన్నాయి. ఇక్కడి వ్యవసాయ పద్ధతులు కూడా బాగున్నాయని.. ప్రపంచంలోని చాలా గ్రామాలు ఇక్కడి రైతులను ఆదర్శంగా తీసుకోవాలని సూచించాయి. అందువల్లే అంకాపూర్ గ్రామం అనేది తెలంగాణలో అత్యంత ఖరీదైన గ్రామంగా పేరు పొందింది.. ఖరీదైన గ్రామం అయినప్పటికీ.. ఇక్కడ పొదుపు సంఘాలకు తక్కువ లేదు. మహిళలు సంఘాలుగా ఏర్పడి తమ సంపాదించిన డబ్బును పొదుపు చేసుకుంటున్నారు. అంతేకాదు స్వయం ఉపాధికి సిసలైన చిరునామాగా నిలుస్తున్నారు.