Kodali Nani: మా ఉద్యోగం పీకేశారు.. ఏం చేయమంటారు?.. మీడియాపై కొడాలి నాని రుసరుస

Kodali Nani: సుదీర్ఘ విరామం తర్వాత ఏపీకి వచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని( Kodali Nani). గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్ట్ నేపథ్యంలో ఈరోజు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆయనను పరామర్శించారు. కొద్దిరోజుల కిందట గన్నవరం టిడిపి కార్యాలయం పై దాడికి సంబంధించి.. అక్కడ పనిచేసే ఒక ఉద్యోగిని బెదిరించి, కిడ్నాప్ చేశారన్న ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాదులో ఉంటున్న ఆయనను అరెస్టు చేసి విజయవాడ తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరచగా.. 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ప్రస్తుతం విజయవాడ సబ్ జైల్లో ఉన్నారు వల్లభనేని వంశీ మోహన్. ములాఖత్ లో వల్లభనేని వంశీని కలుసుకున్నారు జగన్.
* అడ్డుకున్న జైలు అధికారులు
మరోవైపు వల్లభనేని వంశీని( vallabaneni Vamsi ) కలిసేందుకు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని వెళ్తుండగా జైలు అధికారులు అనుమతించలేదు. దీంతో జగన్మోహన్ రెడ్డి ఒక్కరే జైలు లోపలికి వెళ్లారు. జైలు ప్రాంగణంలో ఉన్న మాజీమంత్రి కొడాలి నానిని పలకరించే ప్రయత్నం చేసింది మీడియా. అయితే ఎప్పుడు దూకుడుగా ఉండే కొడాలి నాని కాస్త తగ్గి మాట్లాడారు. గతం మాదిరిగా బూతు పదాలు లేకుండా మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ మీడియా ప్రశ్నల పై అసహనం వ్యక్తం చేస్తూ.. అడ్డగోలుగా జవాబులు చెప్పారు..
* ప్రతిరోజు మీకు వచ్చి కలవాలా?
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీలో ఎందుకు యాక్టివ్ గా లేరని ప్రశ్నిస్తే.. ప్రతిరోజు మిమ్మల్ని కలవాలా అంటూ లేడీ రిపోర్టర్ కు దిమ్మతిరిగే జవాబు ఇచ్చారు. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బిఆర్ నాయుడు, మీకు రోజు వచ్చి కలవాలా అంటూ సమాధానం ఇచ్చారు. అయితే ఎందుకు పార్టీ కార్యక్రమాలతో పాటు బయట కనిపించడం లేదని ప్రశ్నిస్తే.. తమ ఉద్యోగం పీకేసారని.. మీ ఉద్యోగం పీకేస్తే మైకులతో ఊరంతా తిరుగుతారా అంటూ సెటైరికల్ గా మాట్లాడారు. తదుపరి అరెస్టు మీదేనా? రెడ్ బుక్ లో ఉన్న పేరు మీదేనటగా? అని ప్రశ్నించే సరికి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. మీరు రెడ్ బుక్ చూశారా? ఆయన ఏమైనా చూపించారా? అంటూ తిరిగి ప్రశ్నించారు.
* లాయర్లు చూసుకుంటారులే
మీపై త్వరలో కేసులు నమోదవుతున్నాయి అని జరుగుతున్న ప్రచారంపై ప్రశ్నిస్తే తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కొడాలి నాని( Kodali Nani). మూడు కాదు 30 కేసులు పెట్టుకోవాలని సవాల్ చేశారు. ఇంతమంది లాయర్లు ఉంటే తనకేం భయం అని ప్రశ్నించారు. అక్కడే ఉన్న లాయర్లను చూపించి తనకు ఎటువంటి కేసుల భయం లేదని తేల్చి చెప్పారు. మొత్తానికి అయితే ఎప్పుడు బూతులు మాట్లాడే కొడాలి నాని.. కాస్త తగ్గినట్టు కనిపించారు. కానీ ముక్తసరిగా సమాధానాలు చెప్పారు.